31, ఆగస్టు 2010, మంగళవారం

అచ్యుతాష్టకం

అచ్యుతం కేశవం రామ నారాయణం,
కృష్ణ దామోదరం వాసు దేవం హరిం;
శ్రీధరం మాధవం గోపికా వల్లభం,
జానకీ నాయకం రామ చంద్రం భజే. ||1||
అచ్యుతం కేశవం సత్యభామాధవం,
మాధవం శ్రీధరం రాధికారాధితమ్;
ఇందిరా మందిరం చేతసా సుందరం,
దేవకీ నందనం నందజం సందధే. ||2||
విష్ణవే జిష్ణవే శంఖినే చక్రిణే,
రుక్మిణీ రాగిణే జానకీ జానయే;
వల్లవీ వల్లభా యార్చితా యాత్మనే,
కంసవిధ్వంసినే వంశినే తే నమః. ||3||
కృష్ణ! గోవింద! హేరామ! నారాయణ!
శ్రీపతే! వాసుదేవాజిత! శ్రీనిధే!
అచ్యుతానంత! హే మాధవాధోక్షజ!
ద్వారకానాయక! ద్రౌపదీరక్షక! ||4||
రాక్షసక్షోభితః సీతయా శోభితో,
దండకారణ్యభూపుణ్యతాకారణః;
లక్ష్మణే నాన్వితో వానరైః సేవితో,
అగస్త్య సంపూజితో రాఘవః పాతుమామ్. ||5||
దేనుకారిష్ట కానిష్టకృద్ ద్వేషిహా,
కేశిహా కంసహృద్వంశికావాదకః;
పూతనాకోపకః సూరజాఖేలనో,
బాలగోపాలకః పాతుమాం సర్వదా. ||6||
విద్యుదుద్ద్యోతవత్ప్ర స్ఫుర ద్వాససం,
ప్రావృడంభోదవత్ప్రోల్లసద్విగ్రహమ్,
వన్యయా మాలయా శోభితోరః స్థలం,
లోహితాంఘ్రి ద్వయం వారిజాక్షం భజే. ||7||
కుంచితైః కుంతలైః భ్రాజమానాననం,
రత్నమౌళిం లసత్కుండలం గండయోః ;
హారకేయూకరం కంకణప్రోజ్జ్వలం,
కింకిణీమంజులం శ్యామలం తం భజే. ||8||
||ఇతి శ్రీ మచ్చంకరాచార్యకృతమచ్యుతాష్టకం సంపూర్ణమ్.||

1, ఆగస్టు 2010, ఆదివారం

స్నేహం

ఛెయ్యి చెయ్యి పట్టుకుని.. పొలం పుట్ర దాటుకుని..
ఆటలకై..పాటలకై..
యేటిలోని ఈతలకై..యేటి గట్టు ఊయలకై..
చెంగు చెంగున పరుగుతీసె.. చిన్ననాటి చెలిమిగాళ్ళు..
పల్లె పట్ణం వెడలిపోయె..చదువు సంధ్యల ముసుగుకోసం..
ఊరుదాటిపోయింది..చెలిమి పొద్దుపోయింది..
కొత్త చెలిముల చలవ లోన..పాత చెలిముల మరుపులోన..
తిరిగిపోయెను కాల చక్రం..చేతికొచ్చెను చదువు పత్రం..
మరలి వచ్చెను ఊరిలోకి..వెడలిపోయెను యేటి గట్టుకు..
జట్టుకూడెను బల్యమిత్రులు.. జ్ఞప్తికొచ్చెను తీపి గురుతులు..
మనసు తట్టెను పాత స్నేహం..పొంగిపోయెను మధుర భావం..

26, జులై 2010, సోమవారం

ప్రకృతి

శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు

శ్రీరస్తు!! శుభమస్తు!! అవిఘ్నమస్తు!!
ప్రతి మనిషికి తన భావాలను వ్యక్తపరచడానికి ఏదో ఒక సాధనం కావాలి. కొందరికి చిత్రకళా అయితే మరి కొందరికి రచనలు. ఈ నా రచనా ప్రయాణం అను ఆలోచనకు బీజం వేసింది నా స్నేహితుడు ప్రసాద్. తను కూడా ఈ మధ్యనే బ్లాగ్గింగ్ మొదలు పెట్టాడు. నేను కూడా రాస్తాను. అది నా పర్సనల్ డైరీ వరకు మాత్రమే. కానీ ఇప్పుడు మంచి ఆలోచనలను, ఊహలను స్నేహితులతో పంచుకుంటే ఇంకా బాగుంటుంది అనిపించింది. అసలు మనిషికి ఆలోచనా శక్తి లేకపోతే!!!! అప్పుడెపుడో కీ. శే. రావు గోపాలరావు గారు చెప్పినట్టు మనిషికి గొడ్డు కి తేడా ఏముంది!! ప్రతి మనిషి ఆలోచించాలి..ఎంతల అంటే!! మెదడు దగ్గర మొదలైన ఆలోచనని హృదయపు లోతులను తాకుతూ ఆత్మ కి చేరువైఎంత వరకు!!! సముద్రం లాగే మన హృదయం కూడా ఎంతో గంభీరమైనది లోతైనది. దాని అంతరాలలో ఎన్నో వింతలు, విశేషాలు, వినోదాలు విషాదాలు!! అందుకనే నా ఈ రచనలకు సముద్రం అని నామకరణం చేశాను. ఈ ప్రయాణంలో మీకు స్వచ్చమైన స్వాతి ముత్యాలు దొరుకుతాయి, ఎంతో అందమైన సముద్రపు జీవులు కనపడతాయి, మరెన్నో సాహస యాత్రలు ఉంటాయి. ఈ ప్రయాణానికి మొదటి మజిలి మన పుట్టుక, చివరి మజిలి ఆత్మ ని తెలుసుకోగలగడం. ఎందుకంటె ఆత్మ కి చావు లేదు.